రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసికెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి
గత ప్రభుత్వం వారసత్వంగా రూ. 14 లక్షల కోట్లు
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
తణుకు మండలంలో అభివృద్ధి పనుల్లో మంత్రి
ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో రూ. 7.63 కోట్లుతో అభివృద్ధి పనులకు నాంది
అయిదేళ్ల పాటు విధ్వంస పాలన చేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 30 ఏళ్లుపాటు జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కు తీసికెళ్లారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు విధ్వంసం వైపు వెళ్లిందన్నారు. తణుకు మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రామానాయుడు పాల్గొని మాట్లాడారు. రూ. 7.63 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రూ. 14 లక్షలత కోట్లు అప్పును గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిందన్నారు. ఇలా రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ. 2.40 లక్షల అప్పు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి చంద్రబాబుకు కొండంత అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉంటే వీరికి నరేంద్రమోదీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుల భారాన్ని ప్రజలపై పెట్టకుండా అనేక సంక్షేమ కార్యక్రామలు అమలు చేస్తున్నారని అన్నారు. ఉభయ గోదావరిజిల్లాల్లో నీటిపారుదల శాఖ వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో శిథిలమైన వ్యవస్థలతో పంటలు నష్టపోతున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో రూ. 14 కోట్లు వ్యయంతో సర్వే పూర్తి చేశామన్నారు. రాబోయే ఏడాదిలో ఈ వ్యవస్థను ఉపయోగించుకుని సాగునీటి వ్యవస్థను ఎన్ని వేల కోట్లు వ్యయమైనా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు చేపట్టామన్నారు. గత అయిదేళ్లలో పంచాయతీలకు ఇచ్చిన నిధులను సైతం జగన్‌మోహన్‌రెడ్డి పక్కదోవ పట్టించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెపండుగ పేరుతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో కళ్లెదుల మిల్లు కనబడుతున్నప్పటికీ కసీనం ధాన్యం విక్రయించుకోలేని దుస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తమ ధాన్యం ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కలిగిందన్నారు. విక్రయించిన ధాన్యానికి డబ్బులు కూడా 24 గంటల వ్యవధిలోనే తమ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ముద్దాపురంలో యనమదుర్రు కాలువపై వరద నియంత్రణకు ఏడు తూములకు రూ. 1.96 కోట్లుతో శంకుస్థాపన చేశారు. రెండు అంతర్గత సీసీ రోడ్లు రూ. 22 లక్షలతో ప్రారంభించారు. రూ. 4 కోట్లుతో నిర్మించిన దువ్వ –ఆరుళ్ల ఆర్‌అండ్‌బీ రోడ్డును ప్రారంభించారు. దువ్వ గ్రామంలో రూ. 15.75 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు ప్రారంభించి అనంతరం యనమదుర్రు కాలువపై రూ. 1.30 కోట్లు నిధులతో మూడు స్లూయిజ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


