రూ. 450 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు
తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ వెల్లడి
తేతలి లక్ష్మీనారాయణ పురం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
_కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులతో పల్లె పండుగ నెలకొందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమం ఊపందుకుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. తణుకు మండలం తేతలి, అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తేతలి గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న కుమ్మర్లదిబ్బ దారి మార్గానికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం కల్పించామన్నారు. గతంలో రోడ్డు సౌదుపాయం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు ఈ పరిస్థితుల్లో దారి మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్థానికులకు అండగా కూటమి నాయకులు నిలబడ్డారని తెలిపారు. పురాతనమైన శివాలయం ప్రాంగణంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి విశ్రాంతి భవనం నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం అన్నారు. రాజేశ్వరి కాలనీలో సిమెంటు రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ పురం గ్రామంలో రూ. 68 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణంతో పాటు ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. రూ. 33 లక్షల వ్యయంతో లక్ష్మీనారాయణపురం నుంచి చలివేంద్రచెరువు గ్రామం వరకు బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకున్నామని చెప్పారు. లక్ష్మీనారాయణపురం స్మశాన వాటికకు సంబంధించి రూ. 14 లక్షలతో ఎన్ ఆర్ జీఎస్ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా వివిధ నిధుల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450 కోట్లు పైగా వివిధ పథకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేపట్టినట్లు పేర్కొన్నారు.
తేతలి గ్రామ అభివృద్ధికి సర్పంచ్ సరెళ్ల క్రాంతిప్రియ చేసిన సేవలను ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పి.నాగేశ్వరరావు, సరెళ్ల క్రాంతిప్రియ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


