పి4 విధానంతో పేదల కుటుంబాల్లో వెలుగులు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
మార్గదర్శి బంగారు కుటుంబం అవార్డులు అందించిన ఎమ్మెల్యే
దేశంలో ఏ నాయకుడికి లేని దూరదృష్టి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న తీరును ప్రతి ఒక్కరు స్వాగతించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి అధికారపక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా ప్రజల పక్షాన పోరాడుతున్న నేత చంద్రబాబునాయుడు అని అన్నారు. సోమవారం తణుకులోని స్థానిక రోటరీ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పి4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో సహకారం అందిస్తున్న పలువురు దాతలను రాధాకృష్ణ సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులు విమర్శించారని గుర్తుచేశారు. ప్రస్తుతం సైబరాబాద్ నగరం విశ్వవ్యాప్త నగరంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రజలను భాగస్వాములు చేస్తూ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం అయ్యాయని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలను ఆర్థికంగా చేయూత అందించేందుకు చంద్రబాబునాయుడు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. పి4 విధానం ద్వారా ప్రభుత్వంలో భాగస్వాములై ఎంతోమంది దాతృత్వంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు తణుకు నియోజకవర్గంలో అందించడానికి ముందుకు వస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తణుకు పట్టణానికి చెందిన మాజేటి ప్రకాష్ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్న 12 మంది దాతలకు అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


