తణుకు, మార్చి 26
భవన నిర్మాణ కార్మిక సంఘం,ఏఐటీయూసీ,సీపీఐ సీనియర్ నాయకులు యింటి వీరన్న (86) అశ్వస్థతతో గురువారం తణుకు సజ్జాపురంలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన భార్య, నలుగురు కుమార్తెలు కాగా భార్య, ఒక కుమార్తె గతంలోనే మృతి చెందారు.
తణుకు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలంగా పనిచేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఎనలేని పోరాటాలు నిర్వహించారు.భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ సంఘటిత పరచి అనేక ఐక్య ఉద్యమాలు నిర్వహించారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనకు జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.ఛలో పార్లమెంట్ కు జరిగిన ఆందోళనలో జాతీయ నాయకత్వంతో కలసి ఆనాటి ప్రధాని పివి నరశింహారావును కలసిన వారిలో వీరన్న వున్నారు. తణుకు పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. సీపీఐ తణుకు పట్టణ కమిటీ సభ్యునిగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా కోశాధికారిగా, ఉపాధ్యక్షులుగా పనిచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల, కార్మిక సమస్యలు పరిష్కారానికి సీపీఐ నిర్వహించిన అనేక పోరాటాల్లో వీరన్న క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జీవితాంతం కార్మిక ఉన్నతికే నిర్విరామంగా శ్రమించారు.
ఇంటి వీరన్న భౌతికకాయానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, పట్టణ కమిటీ సభ్యులు గారప్రసాద్ సీపీఐ, ఏఐటీయూసీ పతాకాలను భౌతికకాయంపై కప్పి పూలమాలల వేసి నివాళులర్పించారు.వీరన్న మృతి సీపీఐ, ఏఐటీయూసీ బడుగు బలహీన వర్గాలకు తీర్చలేనిదని నివాళులర్పించారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు కొక్కిరిమెట్ట సత్తిబాబు, గండి రామకృష్ణ, ఎన్జీఓ సంఘ నాయకులు పి.శ్రీనివాసులు తదితరులు వీరన్న భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇంటి వీరన్న భౌతికకాయాన్ని రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు విద్యార్థుల పరిశోధనలకు అప్పగించారు.


