పరాభవం కాదు – ప్రాభవం

తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తున్న కూటమి ప్రభుత్వం

:విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కవులు, కళాకారులు, రచయితలకు సమున్నత గౌరవం అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్

“తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా సీఎం చంద్రబాబునాయుడును అభివర్ణించిన మంత్రి దుర్గేష్

“పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

రాష్ట్ర ప్రజలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: కూటమి ప్రభుత్వం తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహచర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును “తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా అభివర్ణించారు. కళలకు సరైన ప్రోత్సాహం లభించినప్పుడే, వాటికి బాసటగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డప్పుడే అవి విరాజిల్లుతాయన్నారు. 2019-2024 గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తెలుగు కళా, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కవులు, కళాకారులు, రచయితలను గౌరవించడం ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో నిలిపివేసిన కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలను సీఎం ఆదేశాల మేరకు తిరిగి నిర్వహిస్తున్నామని, తెలుగు రాష్ట్రం, జాతి కోసం సమున్నతంగా కృషి చేసిన మహానుభావుల ఆశయాలు ముందుకు తీసుకెళ్లి భావితరాలకు స్ఫూర్తినిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా గుర్తింపుకు నోచుకోని కోనసీమ ప్రభల తీర్థాన్ని అధికారిక పండుగగా గుర్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని గుర్తుచేశారు. మహానుభావుల జయంతులు, వర్ధంతులు నిర్వహించాలని సూచించారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని.. నిరుద్యోగుల కోసం 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దివ్యాంగులకు దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. “పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు.

ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో కళలు, సంస్కృతికి పెద్ద పీట వేసింది సీఎం చంద్రబాబునాయుడు అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరూ ఆంధ్రజాతికి మళ్లీ వెలుగులు వస్తున్నాయని అన్నట్లుగా చెప్పారు. ఇది ఒక ప్రత్యేకత ఉన్న ముఖ్యమంత్రి గొప్పదనం అని కొనియాడారు.మన చరిత్ర, సంస్కృతి, కళారీతులను పోషించుకోవాలని అప్పుడే ముందుకు వెళ్తామని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ క్రమంలోనే ఉగాది పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్నామన్నారు.సమాజంలో వివిధ రంగాల్లో, వివిధ కళా రీతుల్లో అద్భుతంగా రాణిస్తూ లబ్ద ప్రతిష్టులుగా ఉన్న కవులు,కళాకారులు, రచయితలను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.కళాకారులు సున్నిత మనస్కులు అని, రాగద్వేషాలు ఉండవని, మణులు, మాణిక్యాలు ఏమీ కోరుకోరని కేవలం చప్పట్లకు ఆనంద పడతారన్నారు. ఈ క్రమంలో అందరూ రాష్ట్రము అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లేలా ఆశీర్వదించాలని కోరారు. మంచి మనసుతో, అమృత హస్తాలతో ఆశీర్వదిస్తే ఆనందదాయకంగా ఈ ఏడాది ముందుకు వెళ్తుందన్నారు.

అనంతరం మంత్రి కందుల దుర్గేష్ సహచరులతో కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ప్రముఖ సిద్ధాంతి మాడుగుల నాగఫణి శర్మ గారి పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను, రచయితలను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు స్వయంగా కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక సేవ, జర్నలిజం, పెయింటింగ్, కళలు తదితర విభాగాల్లో కమిటీ ఎంపిక చేసిన 161 మందికి ఉగాది, కళారత్న(హంస) పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link