పరువు హత్య మరో నిండు ప్రాణాన్ని బలిగొంది… చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. అన్నవరంలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె సోదరులు రాత్రికల్లా దంపతులను వెంబడించి పట్టుకుని వరుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు. బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమజిల్లాలో జరిగిన ఈ హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లికి చెందిన సంధ్య రాయపురం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తోంది. ద్వారపూడికి చెందిన బట్టల వ్యాపారి సూర్యప్రకాశ్ రావును కొంతకాలంగా ప్రేమించింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. వీరిద్దరూ అన్నవరం సత్యనారాయణ స్వామిసన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన సంధ్య ముగ్గురు సోదరులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే సూర్యప్రకాశ్రావుపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. తమ చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


