మత విశ్వాసాలతో ఆడుకుంటే సమాజం క్షమించదు – శాసనమండలి ఘటనపై కూటమి నేతలతో కలిసి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక
దేవుడి చిత్రపటాలను కాళ్లకు బూట్లు, చెప్పులతో పట్టుకోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
ఫోటోలు విసిరేసి భక్తుల మనోభావాలను గాయపరిచారు.. సాక్ష్యాలు ఉన్నా బొత్స బుకాయిస్తారా? అని నిలదీత
తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చరిత్ర జగన్‌ది.. మండలి ఘటన యాదృచ్ఛికం కాదు
జగన్ హయాం నుండి నేటి వరకు వైకాపా అప్రజాస్వామిక పోకడలపై మంత్రి దుర్గేష్ విమర్శ.. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ఏకం కావాలని పిలుపు
మత విశ్వాసాలను దెబ్బతీస్తున్న వైసీపీ తీరుపై వారం రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకటన
రాజమహేంద్రవరం:అత్యున్నత చట్టసభ అయిన శాసన మండలిలో వైకాపా నేతలు శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటానికి చేసిన అపచారాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు మరియు కూటమి నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు ఏ దేవుడి విషయంలో అయినా, ఏ మతం విషయంలో అయినా జరిగే అవకాశముందని మంత్రి దుర్గేష్ అన్నారు. సమాజంలో బాధ్యతాయుతమై స్థాయిలో ఉన్న మనమంతా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు..
శనివారం శాసన మండలిలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఒక బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి బూట్లు, చెప్పులు వేసుకుని మరీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలను పట్టుకున్నారని మంత్రి దుర్గేష్ వివరించారు. “పవిత్రమైన దేవుడి పటాలను గాలిలో ఊపుతూ, ఆ తర్వాత వాటిని నిర్లక్ష్యంగా కిందకు విసిరివేయడం చూసి మేము నిశ్చేష్టులమయ్యాం. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే చర్య” అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన యాదృచ్ఛికం కాదు, ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే, డైరెక్షన్లోనే జరిగింది. గతంలో తిరుమల డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వంటి ఘటనలే దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. అంతే కాదు నాడు వారి హయాంలో ఇష్టం లేని వ్యక్తులను జైల్లో పెట్టించడం, వినతి పత్రాలు ఇవ్వడానికి ఆఫీసుకు వెళ్తే హౌస్ అరెస్ట్ లు చేసి ఇంట్లో కూర్చోబెట్టడం ,తప్పు లేకపోయినా ఏదో ఒక రకమైన కేసు బనాయించి ఇబ్బందులు పెట్టడం తదితర అప్రజాస్వామిక కార్యక్రమాలే మొదటి నుండి వైకాపా వాళ్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటిని వల్లే జగన్ ఒక నియంతగా పేరు తెచ్చుకున్నారని వివరించారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ సభ్యులు బూట్లతో కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి చిత్ర పటాలు పట్టుకున్నారన్న ఆధారాలు స్పష్టంగా ఉన్నా, సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణ వంటి నేతలు వితండవాదం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అదే విధంగా తిరుమల శ్రీవారికి సతీసమేతంగా పట్టువస్త్రాల సమర్పణకు వెళ్లకుండా ఒక్కడే వెళ్తారని, తిరుమలలో గోవింద నామ స్మరణనే మారుమ్రోగాలన్న నిబంధనను ఉల్లంఘించి సాక్ష్యాత్తు వారి పిన్నితో జగన్ రక్షకా గోవింద అనిపించుకున్న దుర్మార్గాన్ని చూసామని మంత్రి దుర్గేష్ ఫైర్ అయ్యారు. వైసీపీకి ఏ రకమైన నమ్మకాలు లేవు. ఏదో రకంగా గలాట చేయడం పరిపాటి అయింది.. భగవంతుణ్ణి కించపరచమని జగన్ ఇచ్చిన ప్రోత్సాహమని స్పష్టమవుతోందన్నారు.జగన్ కు ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం లేదని మరోమారు స్పష్టమైందన్నారు.. ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న ఇటువంటి మతవిద్వేష, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు కూటమి పక్షాన వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, కానీ వైసీపీ నేతలకు ప్రజాస్వామ్య విలువల పట్ల కనీస గౌరవం లేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. సమాజమంతా కలిసి ఈ తరహా విధానాలను ఖండించాలని, నిర్దిష్టమైన ఆలోచన చేయకపోతే భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. భారతీయ సమాజంలో ఉండే వారికి పరమత సహనం ఉంది.. అది కోల్పోయే ప్రమాదం వస్తే ఎవరూ ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో ఇటువంటి పోకడలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని మంత్రి దుర్గేష్ కోరారు.
ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


