తణుకు పట్టణంలోని శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్.ఎన్.వి.టి.లో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సభ ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి సాధించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించగలరని ఆమె పేర్కొన్నారు. నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎం.పి.హెచ్.డబ్ల్యు గ్రూప్ లో జిల్లాలో మొదటి స్థానం సాధించిన వచ్చిన విద్యార్థి కొల్లి బ్లేస్సిని అభినందించారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అనుభవాల ముచ్చట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.తులసి లక్ష్మి, జి. శ్యామ్ కుమార్, డి.శ్రీనివాసన్, కె. ప్రేమకుమారి, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


