నిడదవోలులో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిడదవోలు రూరల్ మండలం కాటకోటేశ్వరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారిని మంత్రి దుర్గేష్ ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణ తేజతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

అంతకుముందు నిడదవోలు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీ సహిత గోలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ బాలా త్రిపురసుందరీ సహిత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలను మంత్రి దుర్గేష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉండ్రాజవరం మండలంలోని మోర్త లో వెలిసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ గౌరీ ఈశ్వర  స్వామి వారి దేవస్థానం, పెరవలి మండలం తీపర్రులోని శ్రీ నరేంద్ర స్వామి వారి దేవస్థానం, అన్నవరప్పాడులో ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, శ్రీ ఉమా విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటుచేసిన అంబికా సమేత స్పటిక లింగరూప ఉమామహేశ్వర స్వామి వారి కోనేటి ఆలయాన్ని దర్శించారు. స్పటిక లింగ రూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పర్శ దర్శనం లో భాగంగా స్వామి వారిని దర్శించి స్పర్శించారు.

అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుడిని ప్రార్థించానన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలవాలని కోరుకున్నానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ భక్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Scroll to Top
Share via
Copy link