ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షికోత్సవం వేడుకలు తణుకు ఎస్. కె. ఎస్. డి. మహిళా కళాశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. 44 కళాశాల వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు పట్టణానికి చెందిన భద్ర ఇఎన్టి హాస్పిటల్ డాక్టర్ కె. వీరభద్రరావు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనదని భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఇంటర్మీడియట్లో నిర్దేశించుకున్న లక్ష్యం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఈ దశలో మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనలో నిరంతరం పట్టుదలతో కృషి చేయాలని ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధతో విని పాటించాలని అలాగే మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన దానికి కారణమైన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలను మరువరాదని అన్నారు. ప్రతి విద్యార్థి సామాజిక స్పృహ కలిగి ఉండాలని సమయం చాలా విలువైనదని ఏ స్థాయిలో సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలాషించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బిహెచ్ హిమబిందు మాట్లాడుతూ ఉన్నత ఆశయాలతో చిట్టూరి సుబ్బారావు ఈ కళాశాలను స్థాపించారని వారి ఆశయాలకు అనుగుణంగా కళాశాలను ముందంజలో ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని కళాశాలలోని విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచడమే కాకుండా క్రీడాలు యోగ వంటి విభిన్న రంగాలలో మంచి నైపుణ్యతను సాధిస్తూ కళాశాల ప్రతిభను నలు దిశల చాటుతున్నారని అన్నారు. ఎస్ కే ఎస్ డి కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పరీక్షల యందు ఉత్తమ ప్రతిభ కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎండోమెంట్ సిల్వర్ మెడల్స్ మరియు ప్రొఫెషియన్సీ కల్చరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగాల్లో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, ఎస్ కే సి డి సంస్థల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం , అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


