కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చినవీరభద్రరావు మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కొత్తగా తీసుకొచ్చిన వి బిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తణుకు మండలం కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామపంచాయతీలు వద్ద అధికారులకు వినతిపత్రాలు అందించినారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధిహామీచట్టాన్ని బిజెపి ప్రభుత్వం రద్దుచేసి ఆ స్థానంలో వి బి జి రామ్ జి పథకాన్ని తెచ్చిందని వారు చెప్పుకొచ్చారు. పథకం అమలకు రాష్ట్రాలే 40 శాతం నిధులు భరించాలని షరతు విధించిందని ఇప్పుడు అమలు జరుగుతున్న అంచనా ప్రకారం చూస్తే ఏడాదికి 4వేల కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని దీంతో పథకానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా చేతులెత్తేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగిస్తూ వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేసి ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెరిగిన ధరలు కు అనుగుణంగా కనీస వేతనం 600 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధికూలీలు పాల్గొన్నారు.


