ప్రజల కోరిక మేరకు కల్వర్టు నుండి గ్రామం వరకు రహదారి విస్తరణ.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడి..విస్తరణకు అదనంగా రూ. 15 లక్షలు మంజూరు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు
నిడదవోలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం
కేంద్ర బడ్జెట్ ద్వారా పర్యాటక రంగానికి మహర్దశ రానుందని వెల్లడి
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని 1.4 కి.మీల పొడవైన కానూరు – నడుపల్లికోట రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి శ్రేణులతో కలిసి సంబంధిత రహదారిపై బైక్ ను నడిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కానూరు-నడిపల్లికోట రహదారి సమస్యను నాబార్డు నిధుల నుంచి రూ. 1.50 కోట్లతో పరిష్కరిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 3.75 మీటర్ల రోడ్డును 5.5 మీటర్లకు విస్తరిస్తున్నామని, అయితే కల్వర్టు సమీపంలో కూడా 3.75 మీటర్ల రోడ్డును కూడా 5.5 మీటర్లకు విస్తరించాలని స్థానిక కూటమి నాయకులు, ప్రజలు కోరగా వారి విన్నపం సమంజసమని భావించి తక్షణమే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకు అయ్యే అదనపు రూ. 15 లక్షల వ్యయాన్ని మండల నిధులు మరియు ఇతర నిధుల నుండి కేటాయించి, పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే, కాంపోనెంట్ ప్లాన్‌లో లేకపోయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం అప్రోచ్ రోడ్డు, బాక్స్ కల్వర్టు పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి నిడదవోలు నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. అందులో భాగంగా నడుపల్లికోటకు రూ. 80 లక్షల విలువైన సీసీ రోడ్లు మంజూరు చేయించామని, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 11 కోట్లతో గ్రామీణ లింక్ రోడ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. అదే విధంగా ఆర్ అండ్ బీ శాఖ నుండి రూ. 28 కోట్ల నిధులతో రహదారుల నిర్మాణంతో పాటు మరో రూ. 28 కోట్ల నాబార్డు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
కేంద్ర బడ్జెట్ “వికసిత్ భారత్ – స్వర్ణాంధ్రప్రదేశ్” లక్ష్యాలకు, సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఉందని మంత్రి దుర్గేష్ కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి భారీగా నిధులు ఇవ్వడం సంతోషదాయకమని, ఏపీకి ఇప్పటికే పర్యాటక అభివృద్ధి కోసం రూ. 450 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. ప్రస్తుతం అరకు లోయ అభివృద్ధి, బుద్ధిస్ట్ సర్క్యూట్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం, ఉపాధి చేకూరుతాయన్నారు. ఎకో టూరిజంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవకు కేంద్రం సానుకూలంగా స్పందించడం, నిధులు కేటాయింపు చేయడం గర్వకారణమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


