ముందు రోజే పెన్షన్లు అందించడం వైసీపీకి చెంపపెట్టు
నియోజకవర్గంలో రూ.15.16 కోట్లు పెన్షన్లు అందజేత
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తూర్పువిప్పర్రు శివారు నారాయణపురంలో గ్రామదర్శిని
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతుందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను దూరంగా పెట్టి వారి ద్వారా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు నిలిచిపోతాయని ప్రచారం చేశారని చెప్పారు. శనివారం ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు శివారు నారాయణపురం గ్రామంలో పెన్షన్లు పంపిణీ ప్రక్రియను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ప్రతినెల 36,618 మంది లబ్ధిదారులకు రూ. 15.16 కోట్లు మేర పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతినెల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, సచివాలయం కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు సొమ్మును అందజేస్తున్నామని తెలిపారు. ఉదయం నుంచి మొదటి రోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నెలలో మొదటి తేదీ సెలవు దినం వస్తే ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా పెన్షన్లు అందజేశామని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి చంపపెట్టుగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా రూ. 1400 కోట్లు నిధులతో జలజీవన్ పథకానికి శంకుస్థాపన చేశారని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు 30 వేలు లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నారాయణపురం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి రూ. 20 లక్షలు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


