వైసీపీ నాయకుల ముఠా గుట్టు రట్టు చేసిన సిట్
‘సిట్’ రిపోర్టులో క్లీన్‌చిట్ ఇచ్చినట్లు వైసీపీ హడావుడి
రసాయనాలతో లడ్డూ తయారు చేశారని సిట్ నిర్థారణ
కారుమూరికి వెంకన్న గుడి మెట్లు ఎక్కే అర్హత లేదు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజం
పసుపు నీళ్లతో ఆలయం శుద్ధి చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తిరుమల వెంకన్న లడ్డూను అపవిత్రం చేసేలా కల్తీ నెయ్యి తయారు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు రూ. 250 కోట్లు దోపిడీ చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని, కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని సిట్ దర్యాప్తు, చార్జిషీట్ ద్వారా బట్టబయలైందని ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లడ్డూ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకు ముందుకు ఆలయానికి విచ్చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు గుడి మెట్లు ఎక్కే అర్హత లేదంటూ పసుపు నీళ్లతో మెట్లు శుద్ధి చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. తిరుపతి వెంకన్న ప్రసాదం విషయంలో జరిగిన మహా కల్తీ సిట్ రిపోర్టు ద్వారా గుట్టు రట్టయ్యిందన్నారు. తాము ఏం తప్పు చేయలేదని చెబుతున్న వైసీపీ నాయకుల ముఠా ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతిలో జరిగే లడ్డూ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశామని తాజాగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చిందన్నారు. కనీసం చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లు లడ్డూలు సరఫరా చేశారని గుర్తు చేశారు. తప్పు చేయలేదని చెప్పిన వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం ఎందుకు కోర్టుకు వెళ్లారో చెప్పాలన్నారు. నెయ్యి కల్తీ చేయలేదు… స్వామి వారికి ద్రోహం చేయలేదని వైసీపీ నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. వైసీపీ గత అయిదేళ్లలో మొత్తం 1.61 కోట్లు కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లు మేర శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేసి మహాపాపం మూట కట్టుకున్నారని విమర్శించారు. అయిదేళ్లపాటు హిందూ మతం, హిందూదేవుళ్లు, పూజారులపైనా దాడులు చేశారని ఆరోపించారు. చిన్న కేసు కదా అని పరకామణిలో దొంగతనం చేసిన వాళ్లను జగన్‌మోహన్‌రెడ్డి వెనుకేసుకుని రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గంలో సైతం గుడులను బ్రష్టు పట్టించారని ఆరోపించారు. దువ్వ దానేశ్వరి అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణానికి రూ. కోటి నిధులు తీసుకువస్తానని, రూ. 25 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించిన మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు కనీసం రూపాయి కూడా నిధులు తీసుకురాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలోని మూడు దేవాలయాల అభివృద్ధికి రూ. 7 కోట్లు నిధులు తీసుకువచ్చామన్నారు. గత అయిదేళ్లలో వైసీపీ నేతలు చేసిన పాపాలు వారి మెడకు చుట్టుకుంటాయని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


