తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
బౌద్ధ దమ్మ పీఠం ఆధ్వర్యంలో తణుకు నుంచి శాంతి ర్యాలీ
ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శేషారావు
తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి బౌద్ధ ఆలయాన్ని నిర్మించి గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, క్షమాగుణంతోపాటు ప్రతి ఒక్కరి శాంతి, సమానత్వంతో మెలగాలనే బోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహార్ లో జరిగే కలశస్థాపన ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా తణుకు నుంచి శాంతి ర్యాలీ ప్రారంభించారు. బౌద్ధ దమ్మ పీఠాధిపతి అనాలియో ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కలశాలతో శాంతి ర్యాలీను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ బౌద్ధ మతం అనేది ధర్మానికి ప్రతీక అనే ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని పాటించి ఆచరించాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బుద్ధుడిని తన మొదటి గురువుగా భావించి సమానత్వం ఉండాలని సమ సమాజ నిర్మాణం జరగాలని తెలియజేసిన అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. అంబేద్కర్ పాటించిన బౌద్ధమతం అనేక కులాలు, మతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరిగే విధంగా బుద్ధుడి బోధనలను అనుసరించాలని కోరారు.గయలో ఉన్న బౌద్ధ దేవాలయాన్ని పోలిన దేవాలయాన్ని ఉండ్రాజవరంలో నిర్మించడం అభినందనీయమని అన్నారు. దీని ద్వారా టూరిజం మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉండ్రాజవరం గ్రామ సర్పంచి గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, చివటం పిఎసిఎస్ అధ్యక్షులు ముళ్లపూడి పాండురంగ తదితరులు పాల్గొన్నారు.


