జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా తాడిపర్రు పాఠశాల ప్రాంగణంలో జరిగాయి. ఈ సందర్భంగా పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో అలంకరణలతో పిల్లలు చూపరులను ఆకట్టుకున్నారు. కనుమరుగవుతున్న మన సంస్కృతీ సంప్రదాయాలను, పండుగ శోభను నేటి తరానికి తెలియజేయడం కోసం పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించామని, ఇటువంటి సంబరాలను ప్రోత్సహించటం ద్వారా పిల్లలకు పండుగ విశిష్టత తెలియజెప్పటం పెద్దలందరి బాధ్యత అంటూ గ్రామ సర్పంచ్ నరేంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, బిజెపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ, గారపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.


