దళితులను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి

దళితుల పట్ల వివక్ష చూపిన వైసీపీ ప్రభుత్వం

డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకున్న కూటమి ప్రభుత్వం

రూ. కోటి సాయంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇచ్చిన కూటమి

తణుకులో విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు

దళితులను విస్మరించి వారి పట్ల వివక్ష చూపుతూ వారిని ఎన్నో రకాలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ విమర్శించారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను ఎన్నో రకాలుగా హింసించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని ఆరోపించారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తూ అణగారిన వర్గాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఉద్దేశంతో రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు సుధాకర్ కుమారుడు కి డిప్యూటీ తాసిల్దార్ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. ఆనాడు దళితులను ఉద్దరిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యను సైతం రద్దు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నారని అన్నారు. టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, ఇరగవరం మాజీ జడ్పిటిసి సభ్యులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటూ ఉందని అన్నారు. గత ఐదు ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అనేకమంది దళితులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన జగన్ మోహన్ రెడ్డి తీరును ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link