ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్,రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి
అమరావతి:కోనసీమ విశిష్ట సంప్రదాయమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి కొనియాడారు. ఈ మేరకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా తెలుగువారి సంస్కృతికి, ఆచారాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని, తద్వారా ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ కనుమ నాడు నిర్వహించే ఈ తీర్థం, 11 పురాతన శైవ క్షేత్రాల కలయికతో అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. కౌశికా నదిలో ప్రభల ఊరేగింపు వంటి అద్భుత దృశ్యాలను చూడటానికి ఏటా సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు, కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన ఈ ఉత్సవానికి, ఇప్పుడు రాష్ట్ర పండుగ హోదా రావడం గర్వకారణమని తెలిపారు.రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని మరింత భద్రంగా అందించేందుకు, ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.


