పైడిపర్రులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకులో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాలు
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందు వరుసలో ఉండే తత్వం వంగవీటి మోహనరంగాది అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం వంగవీటి మోహనరంగా వర్ధంతి పురస్కరించుకుని తణుకు మండలం పైడిపర్రులో నూతనంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. చిన్నపాటి పనులు చేసుకునే కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుని వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన వంగవీటి మోహన రంగా చేసి చూపించిన ఫలాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. యువత వంగవీటి మోహన రంగా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి క్షణం వరకు పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు. రంగా మృతి చెంది మూడు దశాబ్దాలు పూర్తయినప్పటికీ ఇంకా ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన చేసిన కృషి ఫలితమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, కాపు సంఘం రాష్ట్ర నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు వెంకటేశ్వర ధియేటర్ సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


