తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కత్తవపాడులో అమరజీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన
శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికి అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గాన్ని ఈ పథకం అందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తణుకు నియోజకవర్గం దాదాపు రూ. 54 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పారు. 2027 నాటికి ఈ పథకాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. గ్రామంలో 60 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించుకుని దీని ద్వారా మండలంలో అనేక గ్రామాలకు ముఖ్యంగా శివారు గ్రామాలకు నూరు శాతం తాగునీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా గ్రామీణ శాఖలో రోడ్లు తాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో గతంలో జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటిని అందించాలని లక్ష్యంతో ప్రారంభించిన పథకాన్ని 2014- 19 కాలంలో వైసిపి నాయకులు ఆటకెక్కించారని గుర్తు చేశారు సంబంధిత పథకానికి తూట్లు పొడిచి అస్తవ్యస్తంగా పరిపాలన చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రోడ్లు అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది చివరినాటికి పంచాయతీ రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేశామని చెప్పారు. దీంతో పాటు ఆర్ అండ్ బి రోడ్లు సైతం నిర్మాణాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


