వేదిక ఏర్పాటుకు పలుప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సభాస్థలిపై తుది నిర్ణయం తీసుకున్నాక మరలా వెల్లడిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: నిడదవోలులో రూ.1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత కార్యక్రమం ఏర్పాట్ల కోసం రెండు మూడు ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపాన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గాన సభా వేదికకు రానున్నట్టు వెల్లడించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నిడదవోలు నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సభా వేదిక ప్రాంతం తుది నిర్ణయానికి వచ్చాక పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


