సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్సవ్ ( బీచ్ ఫెస్టివల్ ) ను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహణ

విశాఖపట్నం: శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొలి సమీక్ష సమావేశంలో విశాఖ ఉత్సవ్ ( బీచ్ ఫెస్టివల్ ) పోస్టర్ ను సీఎం చేతుల మీదుగా మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరింప చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. ఈ క్రమంలో విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్సవ్ ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్ పై కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేస్తామన్నారు. బీచ్ ఫెస్టివల్ ను ఒక పెద్ద ఈవెంట్ గా నిర్వహించి పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరుగుతోందన్నారు. గడిచిన అయిదేళ్లలో విశాఖ ఉత్సవ్ ను నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నామన్నారు.

బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, సిఎస్ విజయానంద్, టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ , టూరిజం శాఖ ఆర్ డీ కళ్యాణి, డీవీఎం జగదీష్, డీటీఓ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link