• 100 పడకల ఆస్పత్రి హడావిడి చేస్తే రాదు .. పూర్తిస్థాయి పరిపాలన, ఆర్థిక, వైద్య సిబ్బంది నియామక అనుమతులు సాధిస్తే వస్తుందని స్పష్టం
• పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం లేకుండా బిల్డింగ్ నిర్మించి ప్రయోజనమేంటి.. మీరు అన్నట్లుగా వైద్య సిబ్బంది నియామకం ఎక్కడ జరిగిందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్
• వాస్తవంగా 100 పడకల ఆస్పత్రికి తగ్గ వైద్య సిబ్బంది ఉంటే ప్రజలు రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎందుకు వెళ్తారు..ఆ దుస్థితికి కారణం మీరు కాదా?
• నాబార్డు ద్వారా లోన్ కి ప్రతిపాదనలు పంపించినంత మాత్రాన ఆస్పత్రి నిర్మాణం జరుగదు.. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చినట్లు నటించి విడుదల చేయకుండా అర్థం లేని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఫైర్
• ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేస్తే ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందా?
• మీ హయాంలో నిధులు కాగితాలపైనే ఉన్నాయి.. నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి.. ఇదొక ఎలక్షన్ స్టంట్ గానే ప్రజలు భావించారు కాబట్టే 11కు పరిమితం చేశారని విమర్శ
• గడిచిన ఐదేళ్ల కాలంలో విద్య, వైద్య సేవలు ప్రజల హక్కు అని గుర్తురాలేదా అని మండిపాటు
• హామీలు ఇస్తే సరిపోతుందా ? అమలు చేయాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం
• ఆస్పత్రి నిర్మాణాన్ని ఆపామని చెప్పడానికి రుజువులేమిటి ? ప్రజానీకం పూర్తిస్థాయి వైద్య సేవలు పొందలేకపోవడానికి వైసీపీ అలసత్వం కారణం కాదా అని నిలదీత
• అధికారంలో ఉన్నన్నాళ్లు ఏం చేశారని ఇప్పుడు పోరాటాలు చేస్తామంటున్నారు? మీ అలసత్వం, నిర్లక్ష్యం, అసమర్థతపై పోరాటం చేసుకోవాలని ఎద్దేవా
• కూటమి ప్రభుత్వ హయాంలోనే నిడదవోలు పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేసి చూపిస్తామని వెల్లడి
నిడదవోలు: నిడదవోలు 100 పడకల ఆస్పత్రి అప్ గ్రెడేషన్ అంశంపై మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు చేసిన విమర్శలకు మంత్రి కందుల దుర్గేష్ గట్టి సమాధానం ఇచ్చారు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ అవ్వాలంటే కేవలం హడావిడి కాదు, పూర్తిస్థాయి ఆర్థిక, పరిపాలన, సిబ్బంది నియామక అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. 100 పడకల ఆస్పత్రికి 66 మంది వైద్య సిబ్బంది పోస్టులు అవసరమని, వారి జీతభత్యాలు, ఇతర అంశాలకు కలిపి దాదాపు ఏటా రూ.4.49 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం లేకుండా బిల్డింగ్ నిర్మించి ప్రయోజనమేంటి అని ప్రశ్నించారు. శ్రీనివాసులు నాయుడు అన్నట్లుగా వైద్య సిబ్బంది నియామకం జరిగి ఉంటే సంబంధిత వివరాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా 100 పడకల ఆస్పత్రికి తగ్గ వైద్య సిబ్బంది ఉండి ఉంటే ప్రజలు రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎందుకు వెళ్తారని, ఆ దుస్థితికి కారణం గత ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఇవేవీ తెలియకుండా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య సిబ్బంది, మౌలిక వసతులపై అవగాహన రాహిత్యంతో శ్రీనివాసులు నాయుడు మీడియా ముందుకొచ్చి అవాస్తవాలు చెబితే వాస్తవం అయిపోదని ఆగ్రహించారు. అన్ని అనుమతులతో కూటమి ప్రభుత్వ హయాంలోనే నిడదవోలు పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేసి చూపిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే..
కేవలం ప్రతిపాదనలు పంపిస్తే ఆస్పత్రి అప్ గ్రెడేషన్ అవుతుందా?
నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం 2023-24లో నాబార్డ్ అధికారులు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) క్రింద రూ.19 కోట్లు మంజూరు చేశారు. ఇందులో నాబార్డ్ రుణంగా రూ.15.23 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.3.73 కోట్లుగా చెల్లించాలన్న నిబంధన ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాలని, వైద్య సిబ్బందికి అనుమతులు తీసుకోవాలని అంత క్లియర్ గా ఉంటే మీరెందుకు ప్రతిపాదనలు మాత్రమే పెట్టి వదిలేశారు? కేవలం కాగితం మీద అనుమతులు ఉండి, సిబ్బంది నియామకం లేకుండా ఆస్పత్రి అప్ గ్రెడేషన్ అవుతుందా? నాబార్డు నిధులు వస్తాయని నమ్మి, వైద్య సిబ్బంది నియామక అనుమతులు లేకుండా హడావిడిగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఎన్నికల ముందు అర్ధాంతరంగా ఆపింది మీరు కాదా? మీ హయాంలో నిధులు కాగితాలపైనే ఉన్నాయి.. నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి.. ఇదొక ఎలక్షన్ స్టంట్ గానే ప్రజలు భావించారు కాబట్టే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ అంశంలో మమ్మల్ని నిందిస్తే రాజకీయ లబ్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నారా? తాను ఆస్పత్రి నిర్మాణాన్ని ఆపానని చెప్పడానికి రుజువులేమిటి? ప్రజలకు పూర్తి వైద్య సేవలు అందకపోవడానికి వైసీపీ అలసత్వం కారణం కాదా? ఎన్నికల ముందే 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఎందుకు గుర్తొచ్చింది? ఐదేళ్లలో చేయలేని పని ఎన్నికల ముందు హడావిడిగా చేస్తే పూర్తవుతుందా? పైగా సమయం సరిపోలేదని తడుముకుంటారా?
గతంలో జరిగిందేంటే
2011లో నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బూరుగుపల్లి శేషారావు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిని 10 పడకల నుండి 30 బెడ్ల ఆస్పత్రిగా మారేందుకు చొరవ తీసుకున్నారు. ఆ జీవో 2018లో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో విలీనం చేయడం జరిగింది. 122 హాస్పిటళ్లను నాడు ఏపీ ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రులుగా మార్చిన సందర్భంలో అందులో నిడదవోలు ఒకటిగా నిలిచింది. అదే సందర్భంలో 30 పడకల ఆస్పత్రికి అవసరమైన 8 మంది వైద్య సిబ్బందికి ఏపీవీవీపీ దరఖాస్తు చేసింది. అనంతరం 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు నాయుడు 2023 వరకు కూడా వైద్య సిబ్బంది ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ఇది చేతగానితనం కాదా? వైద్య సిబ్బందినే తేలేకపోయిన వ్యక్తి 100 పడకల ఆస్పత్రిని తీసుకొస్తాడంటే ప్రజలు నమ్మరు. 2020 కరోనా సమయంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో రుబీనా అనే డాక్టర్ ఒక్కరే నాలుగేళ్లు పనిచేశారు. ఆ తర్వాత 2021లో పోస్ట్ కోవిడ్ తర్వాత వందల సంఖ్యలో ప్రజలు చనిపోవడం చూసి ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ కుమార్ స్టాఫ్ ప్యాటర్న్ ను స్టార్ట్ చేశారు. రెండేళ్ల కాలంలో 2023 నాటికి 8 మంది వైద్య సిబ్బందికిగానూ ఆరుగురిని నియమించారు. 30 పడకల ఆస్పత్రికే వైద్య సిబ్బందిని తేవడం చేతకాని శ్రీనివాసులు నాయుడు 100 పడకల ఆస్పత్రికి పర్మీషన్ ఎలా తెచ్చారో, ఏ విధానంలో వైద్యసిబ్బందిని శాంక్షన్ చేయించారో ప్రజలకు సమాధానం చెప్పాలి.. శ్రీనివాసులు నాయుడు తెచ్చింది కేవలం కన్ స్ట్రక్షన్ పర్మీషన్సే.. కన్ స్ట్రక్షన్ లో ఒక పునాది రాయే మీరు వేసింది. ఒక్క రాయి వేసిన మీరు కన్ స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేయలేదని మాపై నిందలు వేస్తే అది రాజకీయం అనిపించుకోదు. నిజంగా మీరు 100 పడకల ఆస్పత్రి కట్టి ఉంటే నిడదవోలు నియోజకవర్గ ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లి అవస్థలు పడి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఏంటి ? ఏపీవీవీపీలో హెచ్ ఆర్ పాలసీ పూర్తవకుండా 100 పడకల ఆస్పత్రికి గుర్తింపు రాదనే కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎలా?
2021లో పోస్ట్ కోవిడ్ తర్వాత 50 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు,5 వెంటిలేటర్లు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి ఇస్తే అవి కూడా వినియోగించలేని శ్రీనివాసులు నాయుడా మాపై నిందలు మోపేది? 2018 నుండి 2023 వరకు ఇచ్చిన ఎక్విప్ మెంట్ వాడకపోవడం వల్ల అవి తుప్పు పట్టే దశకు చేరాయి.. ఇప్పటికీ 5 వెంటిలేటర్లు స్టోర్ రూమ్ లోనే మూలుగుతున్నాయి. దానిపై పీఎం కేర్ అని రాసి ఉంటుంది. అవి కూడా నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. ఇవేవీ తెలియకుండా నిడదవోలు ఆస్పత్రిని తామే అభివృద్ధి చేశామని ఎందుకు చెప్పుకోవడం? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది కాక మాపై అపనిందలు మోపితే చూస్తూ ఊరుకోం.
100 పడకల అప్ గ్రెడేషన్ కు పూర్తి అనుమతులు సాధించిన జీవోలు చూపించగలరా?
నాడు 31.10.2023న జీవో ఎంఎస్ నంబర్ 195, 196లో రాష్ట్రవ్యాప్తంగా రూ.577 కోట్లతో 125 ఆస్పత్రులను అప్ గ్రెడేషన్ చేసేందుకు అనుమతి కోరుతూ, మెడికల్ కాలేజీలు, ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి మంజూరు చేసిన జీవో పత్రాలు మీడియా ముఖంగా చూపిస్తున్నారు.. ఆ పత్రాల్లో నిడదవోలు 100 పడకల ఆస్పత్రి అప్ గ్రెడేషన్ కు సిబ్బంది నియామకంతో సహా పూర్తి అనుమతులు సాధించినట్లైతే చూపించండి.. నాబార్డ్ లోన్ కు ఒప్పుకున్నా కూడా వైద్య సిబ్బందిని నియమాక అనుమతులు లేకపోవడంవల్లే బిల్డింగ్ నిర్మాణం ఆగిన మాట వాస్తవం కాదా? మీరు చేసిన తప్పుకు మేం బలి అవ్వాలా? హామీలు ఇస్తే సరిపోతుందా అమలు చేసే బాధ్యత కూడా ఉండాలి కదా అని మంత్రి దుర్గేష్ ఆగ్రహించారు. 100 పడకల ఆస్పత్రిగా మారితే 66 మంది వైద్య సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. 8 పడకల ఆస్పత్రికి వైద్య సిబ్బందిని తేవడానికే కిందామీద పడిన శ్రీనివాసులు నాయుడు కావాల్సిన డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఎక్కడి నుండి తెస్తారు? హెచ్ ఆర్ పాలసీ పూర్తి కాకుండా ఏపీవీవీపీలో అనుమతులు రావన్న కనీస జ్ఞానం లేని శ్రీనివాసులు నాయుడు అవగాహన రాహిత్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వ చర్యలు:
100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అవ్వాలంటే కావాల్సింది పూర్తి స్థాయి పరిపాలన, ఆర్థిక, సిబ్బంది నియామక అనుమతులని మంత్రి దుర్గేష్ అన్నారు. వాటిని అర్థం చేసుకొని పూర్తి అంచనాలతో కూడిన ప్రతిపాదనలు మళ్లీ ప్రభుత్వానికి పంపించి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కేవలం బిల్డింగ్ నిర్మాణం ఒక్కటే కాదు, బెడ్ల ఏర్పాటు, హెచ్.ఆర్. ఎక్స్ పెండేచర్ (డాక్టర్లు, సిబ్బంది జీతాలు) సహా పూర్తి స్థాయి అనుమతులు సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23 ప్రాజెక్టుల్లో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునికీకరణ కోసం నాబార్డ్ నుండి రూ.471 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం కుదిరిందని, రూ.106 కోట్లు రాష్ట్ర వాటాగా చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నిడదవోలు 100 పడకల ఆస్పత్రి కోసం నాన్-రికరింగ్ క్రింద రూ.19.5 కోట్లు (లోన్), రికరింగ్ క్రింద (జీతాలు, మందుల కోసం) రూ.4.49 కోట్లు రాష్ట్ర వాటా చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో సంబంధిత అంశానికి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రికరింగ్ క్రింద అంటే వైద్య సిబ్బంది జీతభత్యాలు, మందులు తదితరాల క్రింద రూ.4.49 కోట్లు ప్రతి ఏటా జమ అవుతాయి. త్వరలోనే శుభవార్త వస్తుందని ఆశిస్తున్నాం. ఒక రాయి పునాదిగా వేసి బిల్డింగ్ కట్టేశాం, వంద పడకలుగా మార్చేశామని ప్రజలను మభ్య పెట్టడం సరికాదని హితవు పలికారు. నిజంగా మీరు అన్ని అనుమతులు సాధిస్తే మేం మళ్లీ ఆర్థిక అనుమతుల కోసం ఫైనాన్స్ శాఖను ఎందుకు సంప్రదిస్తాం? కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు, ఇతరత్రా కార్యక్రమాలు చేసేందుకు అనుమతులు తెచ్చామంటే సరిపోదని హెచ్చరించారు. శ్రీనివాస్ నాయుడు అజ్ఞాని అని చెప్పడానికి ఇంతకన్నా వివరణ అవసరం లేదనుకుంటున్నాను అని మంత్రి దుర్గేష్ అన్నారు.
ఇకనైనా బుద్ది మార్చుకోండని మంత్రి దుర్గేష్ హితవు
వైసీపీ నేతల అజ్ఞానం, చేతగానితనం, అలసత్వం, నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే నిడదవోలు ఆస్పత్రి 100 పడకలుగా రూపాంతరం చెందేందుకు ఆలస్యమవుతోంది. మీరేంటో, మీ విధానాలేంటో తెలిసే కదా ప్రజలు మిమ్మల్ని 11కు పరిమితం చేసింది.. అయినా కూడా బుద్ది మార్చుకోకపోతే ఎలా ? ఇలాగే అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఒక స్థాయి వరకు ఉండాలే తప్ప ప్రజా సంక్షేమం, ఆరోగ్యం విషయానికి వచ్చే సరికి వాస్తవాలు వెల్లడించి ప్రజానీకానికి న్యాయం చేయాలి. ఈ సందర్భంగా మీ అలసత్వం, నిర్లక్ష్యంపై పోరాటం చేసుకోవాలని ఎద్దేవా చేశారు.


