వ్యవసాయంలో రైతుని శాస్త్రవేత్తని చేయడమే పొలంబడి కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు ద్వారా రైతులు పెంచుకోవడానికి ప్రతివారం సలహాలు సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిలకపాడు గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి సీజన్లో విత్తనం వేసినప్పటినుండి కోత కోసేంతవరకు అనగా 14 వారాలు 30 మంది రైతులను ఎంపిక చేసి ప్రతివారం వారికి సాగులో నూతన విధానాలను వివరిస్తూ కొన్ని కొన్ని ప్రదర్శనలు నిర్వహిస్తూ రైతులు అవసరం మేర ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తూ ఖర్చును సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ నికర ఆదాయాన్ని పెంచేలా వారికి చేదోడు వాదోడుగా ఉండటం అనేది పొలంబడి యొక్క ప్రాథమిక లక్ష్యం తెలిపారు. పొలంబడిలో ముఖ్యంగా నాలుగు సూత్రాలు ఉన్నాయని వాటిలో ఆరోగ్యవంతమైన నారును పెంచడం, మిత్ర పురుగులను సంరక్షించుకోవడం,ప్రతిరోజు పొలం పరిసరాలను విశ్లేషించడం, రైతును తన పొలంలో తనని శాస్త్రవేత్తగా రూపొందించడం అని తెలిపారు.ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్స్ పరీక్షను నిర్వహించారు. అంటే రైతులకు వ్యవసాయంలో కొన్ని అంశాల మీద ఏ మేరకు అవగాహన ఉంది అనేది తెలియడం కోసం ఈ పరీక్షను నిర్వహించినట్లు ఏ.ఓ. వివరించారు. రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ముఖ్యంగా ఎరువులు కొనుగోలు చేసే సమయంలో బయోమెట్రిక్ వేసి తీసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగుల బెడుతున్నారుఅని అలా చేయడమా వల్ల భూసారం తగ్గడంతో బాటు, పర్యావరణ కాలుష్యం ఏర్పడటంతో బాటు చాలా పోషకాలు నష్ట పోతున్నాము అని తెలియజేస్తూ కొత్త పూర్తి అయ్యాక ఒక్కసారి దున్ని సూపర్ ఫాస్ఫేట్ ను ఎకరాకు 100 కేజీలు వేసినట్లయితే ఆ వరి గడ్డి, మోడు త్వరగా కుళ్లి మంచి సేంద్రీయ పదార్థాలు నేలకు చేరుతాయి అని తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవాడ సొసైటీ అధ్యక్షులు అనపర్తి సత్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్ చట్రాది నాగేశ్వరరావు రైతులు మరియు వ్యవసాయ, ఉద్యాన సహాయకులు స్వప్న మీనాక్షి, రీషూ, లోకేశ్వరీ, గ్రేస్ పాల్గొన్నారు.


