హర్షం వ్యక్తం చేసిన రైతాంగం
నిడదవోలు: పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా అన్నదాతలకు సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల, మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నీటి విడుదల కార్యక్రమం ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సాగునీటి సంఘం సహకారంతో నీరు విడుదల చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఇప్పటికే మరమ్మత్తుల ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల చేయాలని కోరుతూ జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుకు సాగునీటి సంఘం రాసిన లేఖను అందించానని గుర్తు చేశారు. ఇందుకు దాదాపు రూ. 7.5 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా)తో మాట్లాడామని, అక్కడి నుండి అనుమతి రావాల్సి ఉందన్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పని చేసి ప్రస్తుతం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్ అండ్ ఆర్) లో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంతితో ఈ అంశం పై మాట్లాడానని చెప్పారు. ఈ అంశాన్ని ఆమె ఫాలోఅప్ చేస్తున్నట్లుగా మంత్రి వివరించారు. త్వరలోనే శుభవార్త వింటామని అన్నారు. స్థానిక అధికారులు ఈ విషయంపై మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సామర్థ్యవంతమైన నీటి నియంత్రణతో కూడిన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణకు, నిరంతర పర్యవేక్షణ నిర్వహణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
మంత్రి కందుల దుర్గేష్, సాగునీటి సంఘాల చొరవతో సాగునీటి సౌకర్యం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.


