ఉడిపి పుట్టిగే మఠంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు
పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం
రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానన్న పవన్
భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్య
ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కల్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి తాను ఉప ముఖ్యమంత్రిగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ స్పష్టం చేశారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు.




