మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కొమ్మరలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం
మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్, హైదరాబాద్ కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శిరగాని నాగేశ్వరరావు (నాగు)అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధి సోకడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించే విధంగా అత్తిలి మండలంలో ఐదు రోజులపాటు ఆయా గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేసిన శిరగాని నాగును అభినందించారు. ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి సుదూర ప్రాంతాలు వెళ్లడంతో పాటు ఎంతో ఖర్చుతో కూడుకున్న భారం అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా మన గ్రామంలోనే చేస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తన సతీమణి పేరుతో ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సాయం అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఈ సేవలను మరింత విస్తృతం చేసే విధంగా చేస్తున్న కృషిని కొనియాడారు. ఇలాంటి శిబిరాలను తణుకు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


