తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయి కిరణ్ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 21 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ కొన్ని పనులకు ఆమోదం తెలుపగా, ఒక అంశానికి సంబంధించి వివరాలు సమర్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సమావేశంలో చర్చించిన పనులు సుమారు 90 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. ప్రధానంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పనిని కమిటీ సభ్యులతో చర్చించి ఆమోదం పొందిన తర్వాతే చేపట్టాలని సూచించారు. హాస్పటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందని, త్వరలో బ్లడ్ బ్యాంకు ను అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అన్నారు. హాస్పిటల్లో ఖాళీగా ఉన్న రేడియోలజిస్ట్ ను వేరే ఆసుపత్రి నుండి ఇక్కడ నియమించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో ప్రధాన విభాగాల్లో వైద్యుల కొరతపై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లేఖరాసి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. క్యాజువాల్టీకి సరైన ప్రవేశం లేదని, శాసనసభ్యులు తెలిపిన మేరకు నేరుగా క్యాజువాలిటీకి చేరుకునేలా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ, ఎలక్ట్రికల్ పనులతో పాటు, డోర్స్, కిటికీలు మరమ్మత్తులను కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం తల్లి పిల్లల విభాగాన్ని, ఫిమేల్ వార్డులను పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలు, సర్జరీలు బాగా పెరిగినందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, డిఎంహెచ్వో డాక్టర్ బి.గీతా బాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే సాయి కిరణ్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ యూ ఎస్ వై రాజాబాబు, ఆర్ ఎం ఓ డాక్టర్ ఏవీఎస్ తాతారావు, కమిటీ సభ్యులు డాక్టర్ అయేషా ఖాన్, కే. కిరణ్మై, వి.గంగారావు, సుంకర ప్రసాద్, ఆసుపత్రి ఏవో షణ్ముఖ రెడ్డి, తహసిల్దార్ డివీఎస్ అశోక్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.


