గడిచిపోయిన రోజు తిరిగి రాదు.. చదువుకోని రోజు భారం అవుతుంది..
ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలి.. ఆలోచనలు మారితే పట్టాలెక్కడం కష్టం, శ్రద్ధ పెట్టి చదవాలి
విద్య ద్వారానే జీవితంలో స్థిరపడగలరు..
నేడు నేర్చిన విద్య ఎన్నటికీ తరిగిపోదు… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఒక అమ్మలా లాలించి, గద్దించి విద్యార్థులకు చదువు ఎంతో ఉపయోగమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తున్నారా, సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు అని ప్రశ్నించారు. మీలో చాగంటి కోటేశ్వరరావు రచించిన “విలువల విద్య” పాఠాలను ఎంతమంది చూశారు అని కూడా ప్రశ్నించారు. సెల్ ఫోన్ కొద్ది సమయం చూడటంలో ఏ విధమైన తప్పు లేదని విజ్ఞానాన్ని పెంచుకునే విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్ వినియోగించాలన్నారు. తప్పుగా ఉండే వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షితులు కాకూడదని అవి మీ జీవితాన్ని అగాధం లోనికి నెట్టేస్తాయన్నారు. చదువుకునే వయసులో ఆలోచన ధోరణి మారితే జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారని, చదువు పైనే శ్రద్ధ ఉంచి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. మీకు కావాల్సినవన్నీ మీ తల్లిదండ్రులు సమకూరుస్తారని, మంచి చెడు తల్లిదండ్రులకు తెలిసినంతగా మీకు తెలియదని, దేనికి ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో నడవాలని సూచించారు. అప్పుడే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని హితవు పలికారు. పదవ తరగతి తర్వాత ఏ ఏ కోర్సులు చేయవచ్చునో ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర కోర్సులు జీవితంలో త్వరగా స్థిరపడడానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత చెందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులు కూడా అంతే శ్రద్ధతో చదవాలని సూచించారు. బట్టి పట్టి చదవడం కాదని పాఠాన్ని అర్థం చేసుకుని చదవాలని, చదివినది తప్పకుండా చూడకుండా రాయాలని అప్పుడే మర్చిపోకుండా మంచి ఫలితాలను సాధించగలుగుతారన్నారు. ఇటీవల నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాధికను జిల్లా కలెక్టర్ అభినందించారు. డిసెంబర్ 5న మెగా పేరెంట్స్ టీచర్స్ డే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక ఈ కార్యక్రమానికి హాజరై మీ పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడంతో పాటు, లోటుపాట్లను సరి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మెగా పేరెంట్స్ టీచర్స్ డే కి తప్పకుండా మీ తల్లిదండ్రులు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అసెస్మెంట్ బుక్ లను పరిశీలించారు.
ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, డీఈవో ఇ. నారాయణ, ఎంఈఓ బి.ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు కె.పద్మావతి, తహసిల్దార్ డివిఎస్ అశోక్ వర్మ, తదితరులు ఉన్నారు.


