దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశానికి దిశా దశ నిర్దేశించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విలువలు, రాజకీయ విధానాలు కేవలం భారతదేశానికి సాధ్యమయ్యాయి అంటే కేవలం భారత రాజ్యాంగం కారణం అని అన్నారు. కింది స్థాయిలో ఉన్న అనేకమందికి రాజ్యాంగం హక్కులు కల్పించి వారందరినీ ఉన్నతంగా ఎదిగే విధంగా అనేక అవకాశాలు కల్పించారని అన్నారు. దేశంలో ఇన్ని మతాలు, కులాలు, వర్గాలు ఏకీకృతమై అందరూ సంఘీతతమై ఉన్నారంటే మనకు అందించిన రాజ్యాంగం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకు మరిన్ని మేలులు చేకూర్చే విధంగా, ఉన్నతంగా ఎదిగే విధంగా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.


