అనుమానాస్పద మృతిగా నమోదు చేసి వదిలేశారు
దీని వెనుక మాజీ మంత్రి కారుమూరి హస్తం ఉంది
మృతురాలు నాగహారిక అమ్మమ్మ పార్వతి
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముళ్ళపూడి నాగహారిక హత్య చేశారని ఎంత మొత్తుకున్నా అప్పట్లో పోలీసులు కనీసం పట్టించుకోలేదని మృతురాలి అమ్మమ్మ గజ్జరపు పార్వతి అన్నారు. కేవలం అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒత్తిడితోనే పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గురువారం తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నేరచరిత్ర కలిగిన తన అల్లుడు ముళ్ళపూడి శ్రీను, రెండో భార్య ముళ్ళపూడి రూపా కలిసి తన మనవరాలిని అత్యంత క్రూరంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆస్తి కోసమే తన మనవరాలిని పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు 2003లో సైతం నాగహారిక తల్లి, తన కూతురు వసంతను సైతం భర్త ముళ్ళపూడి శ్రీను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పారు. అయితే నాగ హారికకు వచ్చే ఆస్తిపై కన్నేసిన సవతి తల్లి ముళ్ళపూడి రూప, భర్త ముళ్ళపూడి శ్రీను కలిసి ఆమె తలపై కొట్టి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారని గుర్తు చేశారు. ఇది హత్య అని చెబుతున్నప్పటికీ అప్పటి సీఐ ఆంజనేయులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని అన్నారు. దీని వెనుక అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్టుమార్టం రిపోర్టు కేవలం హత్య అని నిర్ధారించడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అయితే మూడేళ్ల పాటు తమను మానసిక క్షోభకు గురిచేసిన అప్పటి సీఐ ఆంజనేయులు, కారుమూరి వెంకట నాగేశ్వరావు పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


