తుఫాను ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండ

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

బాధితులకు నిత్యావసరాలను అందజేసిన ఎమ్మెల్యే

ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావాన్ని అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు అత్తిలి మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 1250 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి నిత్యావసరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. మొంథా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి తణుకు నియోజకవర్గంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో పాటు కూటమి నాయకులను అప్రమత్తం చేసి ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసి కూటమి ప్రభుత్వం ఒక సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి పొరుగు దేశాలతో పాటు పురుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క వేల్పూరు గ్రామంలోనే సుమారు రూ. 100 కోట్లు మేర అభివృద్ధికి ఖర్చు చేశామని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కారుమూరి రైతులను దుర్భాషలాడిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. అనంతరం తణుకు మండలంలోని 652 కుటుంబాలకు నిత్యవసరాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link