కారుమూరి ఒత్తిడితోనే కేసు పక్కదోవ పట్టించారు
వైసీపీ నేత ముళ్ళపూడి రూప నిందితురాలు కావడంతోనే
నాగ హారిక హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టాలి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముళ్ళపూడి నాగ హారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదోవ పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రాజకీయ ప్రలోభాలతో వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్ళు కేసును బయటకు రానీయకుండా చేశారని విమర్శించారు. గురువారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. మృతురాలు నాగ హారిక సవతి తల్లి ముళ్ళపూడి రూప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలిగా పని పనిచేయడంతో ఈ కేసులో అప్పట్లో నీరుగారిచేందుకు ప్రయత్నించారని చెప్పారు. ముళ్ళపూడి నాగ హారిక హత్య వెనుక ప్రధాన సూత్రధారి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని అన్నారు. రాజకీయపరంగా పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన కారుమూరి కేసును ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. నాగ హారిక హత్యకు గురైందని మేనమామ, అమ్మమ్మ, తాతయ్య ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కేవలం సెల్ న్ చార్జర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆమె సజీవ దహనం అయిందని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని చెప్పారు. నాగ హారిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా గ్రామ విఆర్ఓ తో ఫిర్యాదు తీసుకుని పోలీసులు ముళ్ళపూడి రూపను ఒక గంటలోనే ఇంటికి పంపించేసి పంపించి వేశారని గుర్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో సైతం తలభాగం తగిలినట్లుగా స్పష్టంగా ఉన్నప్పటికీ కనీసం నివేదికను బయటకు రానీయకుండా అడ్డుకున్నారని అన్నారు. అప్పట్లో పనిచేసిన సీఐ ఆంజనేయులు సైతం పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల నాగ హారిక చనిపోయిందని నిర్ధారణ చేసి విచారణ ముందుకు సాగనీయకుండా అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సిఐ ఆంజనేయులు కుట్ర చేశారని ఆరోపించారు. అయితే నాగ హారిక మేనమామ, అమ్మమ్మ, తాతయ్యలు మాత్రం రెండేళ్లపాటు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడుని కలిసిన సమయంలో అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హత్యగా నిర్ధారించి తండ్రి ముళ్ళపూడి శ్రీనివాస్, సవతి తల్లి ముళ్ళపూడి రూపలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. నాగ హారిక హత్య కేసులో సమగ్రమైన విచారణ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సమగ్రమైన దర్యాప్తు చేసి సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


