నిడదవోలు 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో 1770 ఇళ్లు మంజూరైనట్టు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని స్పష్టం
త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు జారీ.. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్
ఒక్క ఇంటి నిర్మాణంపై గత ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కంటే అదనంగా రూ. 70,000 అందిస్తున్నామని వివరణ
నిడదవోలు: ఇల్లు లేకుండా ఏ పేదవారు ఉండకూడదు అన్న సదుద్దేశంతో, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ధ్యేయంతో సంతృప్త స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2.0 క్రింద రాష్ట్రవ్యాప్తంగా 41, 000 ఇళ్లు మంజూరు కాగా, నిడదవోలు నియోజకవర్గంలో 1770 ఇళ్ళు మంజూరైనట్టు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అందులో భాగంగా నిడదవోలు రూరల్ మండలంలో 646, పెరవలి మండలంలో 666, ఉండ్రాజవరం మండలంలో 308, నిడదవోలు అర్బన్ లో 150 మంజూరైనట్టు తెలిపారు.
బుధవారం నిడదవోలు నియోజకవర్గం రోటరీ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన గృహప్రవేశ, భూమి పూజ, గృహ నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మేరకు నిడదవోలు అర్బన్ లో సొంత స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు ప్రదానం చేశారు. గత ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు మంజూరు చేస్తే అవి పేద ప్రజల ఇంటి నిర్మాణానికి సరిపోవని గుర్తించి కూటమి ప్రభుత్వం 70 వేల రూపాయలు పెంచి 2.50 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో నిడదవోలు నియోజకవర్గంలో 626 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మించుకునే ప్రతి పేదవాడికి కేం ఈ సందర్భంగా ఇళ్ల నిర్మించుకునే ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు అందిస్తున్నామని, అందులో కేంద్ర వాటా 1.50 లక్షలు కాగా, రాష్ట్ర వాటా ఒక లక్ష రూపాయలని తెలిపారు. పునాది స్థాయిలో, రూఫ్ లెవెల్, రూఫ్ కాస్టింగ్ స్థాయిల్లో ఇలా ఒక్కో దశలో 60,000 చొప్పున అందిస్తామని ఇల్లు పూర్తయిన వెంటనే 70000 అందిస్తామని, మొత్తంగా రూ. 2.50 లక్షలు పేదవారి ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతోందని, త్వరలోనే వారికి కూడా ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు జారీ చేసి ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సకాలంలో నిధులు మంజూర అయ్యేందుకు కృషి చేస్తానని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. త్వరలోనే గృహప్రవేశ కార్యక్రమానికి వస్తానని మంత్రి దుర్గేష్ అన్నారు.
ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2.0 ను సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రారంభించారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వెల్లడించారు.
గత ప్రభుత్వాధినేత ప్రజలందరికీ సెంట్ స్థలం ఇస్తానని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. సెంటు స్థలం ఎందుకు సరిపోదని కూటమి ప్రభుత్వం భావించి అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు సెంట్ల స్థలం అందజేశామన్నారు. తద్వారా అర్హులైన పేద ప్రజలు విశాలమైన గృహ నిర్మాణాన్ని పొందే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలు తీరును, లబ్ధిదారులకు అందుతున్న లబ్ధిని మంత్రి దుర్గేష్ వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భూపతి ఆదినారాయణ, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సౌజన్య, కూటమి నాయకులు, గృహాలబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


