రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు, రైతు బజార్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే అవసరమైన స్థలాన్ని నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించారని వెల్లడించారు.
శనివారం నిడదవోలు పట్టణంలోని రంగా సుబ్బారావు–శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలో గాలింకి జిన్నాబాబు (ఛైర్మన్), పువ్వల రతీదేవి (వైస్ ఛైర్మన్), డైరెక్టర్లుగా కోరశిక వెంకటేశ్వరరావు, మారిశెట్టి మీనాక్షి, నల్లూరి అరుణ, పోతబత్తుల శ్రీనివాసరావు, వాకా సత్యనారాయణ, కడలి హేమలత, దిద్దే అరుణకుమారి, దాసం సూర్య సుబ్రహ్మణ్యం, సంగీత పార్వతీదేవి, కాసాకాని సతీష్, దేవళ్ల సత్యశైలజ, కారుమూరి శేషబాబు, హనుమంతు వెంకన్న, అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా భూపతి ఆదినారాయణ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి, ధాన్యం కొనుగోలు, ధరల స్థిరీకరణకు, పారదర్శక వ్యవస్థ ఏర్పాటు దిశగా కృషి చేయాలని సూచించారు. తాను ఎక్స్ అఫీషియో ఛైర్మన్గా కమిటీ మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే రైతాంగ అభివృద్ధి, పంటల సేకరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల, పునరావాసం అవసరమైన ప్రాంతాల అభివృద్ధి, రహదారి మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టత కోసం చర్యలు చేపడతామని తెలిపారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో నిడదవోలు పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రూ.3 కోట్లు, అలాగే ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.290 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి సునీల్, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.


