పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో గురువారం మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం “గ్రామ దత్తత పధకం” లో భాగంగా రైతుశిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సార్వా వరిలో ఆశించే దోమ పోటు నివారణకు, పంట తొలి దశలో సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైనటువంటి బైఫెంత్రిన్, సైపెరిమెత్రిన్, డెల్టామెత్రిన్ లాంటి మందులు పిచికారీ చేయరాదని తెలిపారు. పిలకలు కట్టే దశలో దుబ్బుకు 10 -15 కంటే ఎక్కువగా, అదే చిరుపొట్ట దశలో దుబ్బుకు 20 -25 కంటే ఎక్కువగా దోమలు ఉంటే మార్కెట్ లో అందుబాటులో ఉన్న ట్రైఫ్లుమెజోపైరిం ఎకరాకు 94 మి.లీ లేక 80 గ్రాముల డినోటిఫ్యురాన్ లేక 120 గ్రాముల పైమెట్రోజైన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. డ్రోన్ తో పిచికారీ చేసేటట్లయితే నీటి బిందువు పరిమాణం బాగా తక్కువగా ఉంటుంది కనుక ఎకరాకు పది లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది, కావున ఎటువంటి అపోహలు అవసరంలేదని తెలియజేశారు. చినమల్లం గ్రామం పరిశోధనా స్థానానికి దత్తత గ్రామం కనుక ఎలుకల మందు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
శాస్త్రవేత్త డా.పి.వి.రమేష్ బాబు మాట్లాడుతూ దాళ్వాకోతల తరువాత దుబ్బులను తగలబెట్టకుండా డికంపోజర్లను పిచికారీ చేయడం వల్ల ఎకరాకు సుమారు 20 – 25 కిలోల పొటాష్ భూమికి చేరి నేలకు బలం చేకూరుతుందని తెలిపారు. గడ్డి త్వరగా కుళ్ళడానికి ఘజియాబాద్ డికంపోజర్ లేక పూసా డికంపోజర్ లేక ఆచార్య ఎన్. జి. రంగా డికంపోజర్ A, డిపోజర్ B లలో ఏదో ఒకదానిని వాడుకోవాలని తెలిపారు. కలుపు నివారణకు నాట్లు వేసిన మూడు నుండి ఐదు రోజుల లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి 20 కిలోల పొడి ఇసుకలో ఎకరాకు 1.0 – 1.25 లీ. బుటాక్లోర్ 50% ఇ.సి లేదా 400 మి.లీ ప్రెటిలాక్లోర్ 50%ఇ.సి కలిపి పొలంలో సమానంగా వెదజల్లాలి. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు సమస్యగా ఉంటే, నాటిన మూడు నుండి ఐదు రోజుల లోపు పొలంలో పలుచగా నీరుపెట్టి 20 కిలోల ఇసుకలో నాలుగు కిలోల బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ + పెట్రిలాక్లోర్ 6.6 % జి గుళికలు ఎకరం పొలంలో సమానంగా పడేలా వెదజల్లుకోవాలని తెలిపారు. నాటిన 25 – 30 రోజుల మధ్య వెడల్పాటి కలుపు మొక్కలున్నట్లయితే ఎకరానికి 400 గ్రా. 2,4 డి. సోడియం సాల్ట్ 80% పొడి లేదా 2,4 D అమైన్ సాల్ట్ 58% ఇ.సి 400 మి.లీ పిచికారీ చేయాలని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమమం లో మారుటేరు పరిశోధనా స్థానానికి చెందిన డా.పి.భరత్ చంద్ర, పెనుగొండ మండల వ్యవసాయ అధికారిణి శ్రీమతి స్పందన పాల్గొని రైతుల సందేహాలను నివృత్తిచేసారు.
గ్రామానికి చెందిన అభ్యుదయ రైతులు నెక్కంటి బుచ్చేస్వరరావు, నెక్కంటి విష్ణు, గ్రామ వ్యవసాయ సహాయకుడు శంకర్ తదితరుపాల్గొన్నారు. కార్యక్రమం చివరిలో రైతులకు రెడ్ లేడీ రకానికి చెందిన బొప్పాయి మొక్కలను 40 రైతులకు ఉచితంగా పంపిణీచేశారు.
ఈ కార్యక్రమానికి డా.ఎం.వి.కృష్ణాజీ, ప్రధాన శాస్త్రవేత్త (విస్తరణ విభాగం) గ్రామ దత్తత పధక ఇన్ఛార్జ్ సమన్వయకర్తగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.


