పాలకవర్గానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు
సొసైటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
క్రమశిక్షణ, పట్టుదలతో గతంలో పని చేసిన ఛైర్మన్లు వేల్పూరు సొసైటీను అభివృద్ధి పథంలో నిలిపారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాలవర్గంతోపాటు ఇక్కడి రైతులు అందించిన సహాయ సహకారాలు, క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం మంగవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో రైతులు చెల్లించి మళ్లీ తిరిగి చెల్లించే విధంగా రైతులు సహకారం అందిస్తున్నారన్నారన్నారు. ప్రస్తుతం సొసైటీలో రూ. 3.50 కోట్లు మేర డిపాజిట్లు ఉన్నాయని ముఖ్యంగా సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ, పాల సేకరణ, ఫెర్టిలైజర్లు ద్వారా ఆదాయం సమకూరుతోందన్నారు. సంస్థ ఏ వ్యాపారం చేసినా లాభాల బాటలోనే ఉంటుందని గుర్తు చేశారు. ఆరిమిల్లి వెంకటరత్నం, పెనుమర్తి సోమసూర్యచంద్రరరావు చూపిన మార్గంలో తర్వాతి కాలంలో పని చేసిన ఛైర్మన్లు బాధ్యత, క్రమశిక్షణతోనే సొసైటీను అభివృద్ధి చేశారన్నారు. ఈ సందర్బంగా పాలకవర్గాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. అనంతరం వేల్పూరులోని గీతా మందిరంలో గ్రామ కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


