ఏఎంసీ ద్వారా పుంతరోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు

గత అయిదేళ్లలో ఏఎంసీ ద్వారా అభివృద్ధి శూన్యం

ఏఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకు ఆదాయం పెంచి వ్యయాన్ని తగ్గించి ముఖ్యంగా పుంత రోడ్లు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత అయిదేళ్లలో వచ్చిన ఆదాయ వ్యయాలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత అయిదేళ్ల వైసీపీ పాలనలో ఏఎంసీ ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం ఒక్క పుంత రోడ్డు కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతుల కోసం ఎంతో కృషి చేశామని చెప్పిన వైసీపీ నాయకులు చేయాల్సిన అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఏఎంసీ కమిటీ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణకు ప్రభుత్వాన్ని నిధులు కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌ మార్కెట్‌కు వస్తున్న సెస్సులు, లైసెన్సు ఫీజులు, చెక్‌పోస్టుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదికి రూ. 3 కోట్లు ఆదాయం వస్తోందని మరింత ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మార్కెట్‌ కమిటీలో రూ. 31 కోట్లు నిల్వ ఉందనీ అయితే వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లనున్నట్లు చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏఎంసీ ఆదానం రూ. 10.40 కోట్లు నిల్వ చూపించామని అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూ. 3.30 కోట్లు మాత్రమే నిల్వ చూపించారన్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో అనే విషయంపై చర్చిస్తామన్నారు. గత టిడిపి హాయంలో పుంత రోడ్లు నిర్మాణంతోపాటు మూడు రైతు బజార్లు నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్‌రావు, ఏఎంసీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link