తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, కంసాలపాలెం ప్రాంతాల్లో ఎర్రకాలువ ఉద్ధృతి పెరగడంతో రహదారులపై వరదనీటి ప్రవాహం కొనసాగుతోందనీ, ఆమేరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించి సహకరించాలని జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ ప్రతి గంట పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్థాయి అధికారులకు పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రజల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. స్థానిక పరిస్థితికి అనుగుణంగా పునరవాస కేంద్రాల ఏర్పాటు, క్షేత్ర స్థాయిలో సమన్వయ శాఖల అధికారులు తో సమన్వయం చేసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ శాఖల అధికారులు, రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్ మరియు ఇతర విభాగాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ మరియు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ప్రజల కోసం 24×7 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో తెలియ చేశారు.
ప్రజలకు సూచనలు:
నదులు, వాగులు పొంగిపొర్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
నాటు పడవలపై తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలి.
స్థానిక అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు పాటించాలి.
అనవసర ప్రయాణాలు మానుకుని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి.
పిల్లలు, వృద్ధులను నీటి ప్రవాహానికి దూరంగా ఉంచాలి.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 లేదా కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలి.
తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలి.
కోవ్వూరు డివిజన్ కంట్రోల్ రూమ్ నంబర్లు (24×7):
కోవ్వూరు ఆర్డీవో కార్యాలయం – 79953 67797
మండల కేంద్రంలో..
నిడదవోలు – 96762 53740
గోపాలపురం – 70130 27755
దేవరపల్లి – 97058 18045
నల్లజెర్ల – 94910 41451
ఉండ్రాజవరం – 94910 41474
బొమ్మూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ – 89779 35611
ట్రాఫిక్ మళ్లింపు సూచన
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు – తాడేపల్లిగూడెం మార్గంలో తాళ్లపాలెం మీదుగా వెళ్ళే రహదారిపై ఎర్రకాలువ ఉద్ధృతి కారణంగా వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా ఫోర్ వీలర్లు, టూ వీలర్లు సహా ఎలాంటి వాహనాలు కూడా తాళ్లపాలెం రహదారి మీదుగా రాకపోకలు చేయవద్దని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రజల రక్షణ, స్థానికుల ఇబ్బందులు నివారించడానికి వాహనదారులు తప్పనిసరిగా ఈ మార్గాన్ని ఉపయోగించకుండా, ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించాలి.


