రాష్ట్రంలోని సగానికి పైగా బార్లకు లైసెన్సుల జారీ కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. మొత్తం 840 బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 388 (46.20%) బార్ లకే శనివారం లాటరీ తీసి లైసెన్సుదారులను ఖరారు చేశారు. మిగతా 452 (53.80%) బార్లకు నిబంధనల ప్రకారం కనీసం నాలుగేసి దరఖాస్తులు రాకపోవటంతో లాటరీ తీయలేదు. దీంతో అవి మిగిలిపోయాయి. వీటిల్లో 37 బార్లకు మాత్రం ఒకటి, రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వాటికి సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 వరకూ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. కనీసం నాలుగేసి దరఖాస్తులొస్తే 2వ తేదీ ఉదయం 8 గంటలకు వాటికి లాటరీ తీస్తారు. ఇప్పటివరకూ ఒక్క దరఖాస్తు కూడా రాని బార్లకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
- విశాఖపట్నంలో 121 బార్లకు గాను 57, ఎన్టీఆర్ జిల్లాలో 130కు గాను 62, గుంటూరులో 110కు గాను 42, తిరుపతి జిల్లాలో 29కు గాను 23 బార్లకు లైసెన్సులు ఖరారు చేశారు.
- తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 22 బార్లకు గాను 6, డా. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9కి గాను 1, కాకినాడలో 15కు గాను 3 బార్లకే లైసెన్సులు ఖరారు చేశారు. అతి తక్కువగా ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి.
- గీత కార్మిక కులాలవారికి అదనంగా 84 బార్లు రిజర్వు చేయగా.. అందులో 78 బార్లకు శనివారం లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేశారు. మరో 3 బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 వరకూ పొడిగించారు.


