తణుకులో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

తణుకు మున్సిపల్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.

తణుకు, ఆగస్టు 23, 2025 : “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు పేదరికం అనుభవిస్తూ, ఉన్నత చదువులు చదువుకున్నారనీ, వారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీష్ వారిని గడ గడ గడలాడించి, సైమన్ కమిషన్ కు ఎదురొడ్డి తనను కాల్చమని గుండె చూపించిన ధీరుడు “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని, వారి జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని రాజీవ్ గాంధీ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని శ్రీమతి పట్టెo సుజాత కొనియాడారు.

స్థానిక మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 14 ఆవరణలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల వేదికగా “సాహితీ సామ్రాజ్యం” అను సాహిత్య సంస్థ ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు జయంతి సభకు శ్రీమతి పట్టెo సుజాత అధ్యక్ష వహించారు.

తొలుత “సాహితీ సామ్రాజ్యం” సాహిత్య సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు స్వాగతం పలికారు. తొలుత మునిసిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి పట్టెo సుజాత, ప్రాథమిక పాఠశాల నెంబర్ 14 ప్రధానోపాధ్యాయిని శ్రీమతి నూతక్కి శశి లను తాడినాడ భాస్కరరావు దుస్సాలువాలతో సత్కరించారు.

విద్యార్థులు కల్లూరి నవీన్, గానుగుల ఛాయ, కంటంశెట్టి లేఖన, గాలిదేవర సత్య సాహితి శ్రీ మొదలగు వారు ప్రకాశం పంతులు జీవిత విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా వీరికి సాహితీ సామ్రాజ్యం సాహిత్య సంస్థ తరఫున దేశ భక్తుల జీవిత చరిత్ర పుస్తకములు బహూకరించారు.

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి నూతక్కి శశి, ఉపాధ్యాయులు సబ్బితి రాంజీ కుమార్, వేండ్ర రామ్ మోహన్, వై.ఏడుకొండలు ప్రకాశం పంతులు జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమని హితవు పలికారు.

రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు దేశ భక్తి నిరుపమానమనీ, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు ను గుర్తు పెట్టుకొనే విధంగా వారు జన్మించిన ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లా అని ప్రభుత్వం పేరు పెట్టిందన్నారు. వారు రాజమహేంద్రవరం లో న్యాయవాదిగా పనిజేసి, రాజమహేంద్రవరం తొలి మున్సిపల్ ఛైర్మన్ గా పనిజేశారని కొనియాడారు. విద్యార్థులు వారి దేశ భక్తి ని అలవర్చుకొని దేశం కోసం త్యాగాలు చేసేవిధంగా ఎదగాలని విద్యార్థులకు హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల నెంబర్ 14 ఉపాధ్యాయులు, న్యాయవాది పిట్టా సామ్యూల్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, మానవత నాయకులు ఆలపాటి సుబ్బారావు ప్రభృతులు, 8,9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉన్నత పాఠశాల మొదటి సహాయకులు సబ్బితి రాంజీ కుమార్ వందన సమర్పణ తో ఈ కార్యక్రమం ముగిసింది.

Scroll to Top
Share via
Copy link