ఎక్స్ వేదికగా పద్మవిభూషణ్ డా. చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన నటన, డ్యాన్స్, ఫైట్స్, మ్యానరిజంతో తెలుగు తెరకు కమర్షియల్ సినిమాల అర్ధం చెప్పిన హీరో, కమర్షియల్ సక్సెస్ ల మధ్య నటనా ప్రావీణ్యాన్ని చూపించిన నటుడు చిరంజీవి అని అన్నారు. ఎన్నో కష్టాలు, సవాళ్లు, అవమానాలను తట్టుకొని స్వయంకృషితో సినీవినీలాకాశంలో మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అకుంఠిత దీక్షతో ప్రతి అవకాశాన్ని పట్టువిడవకుండా అందిపుచ్చుకొని నటనలో శిఖరాగ్రాన్ని అధిరోహించిన వ్యక్తి చిరంజీవి అన్నారు.
చిరంజీవి తన అభిమానుల కోసం ఎల్లప్పుడూ ముందుంటారని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆపద్భాందవుడిగా మారుతారన్నారు. అగ్రకథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరంజీవి ఎప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడు అని పేర్కొన్నారు. ఆయన తాజాగా నటిస్తున్న విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు విజయకేతనం ఎగురవేయాలని కాంక్షించారు. జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కోరారు.


