తణుకు, ఆగష్టు 18
సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా 27 వ మహాసభలు సందర్బంగా 19 న తణుకు పట్టణంలో జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ పార్టీ జిల్లా మహాసభలు సందర్బంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది సీపీఐ, ప్రజా సంఘాల శ్రేణులతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు శ్రీచిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి ప్రజాప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ప్రదర్శన అనంతరం మున్సిపల్ ఆఫీస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహించ నున్నట్టు భీమారావు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పాల్గొంటారన్నారు.20 వతేదీ బుధవారం వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు,విశాఖ ఉక్కు పరిరక్షణ, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.
విలేకరుల సమావేశంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు.


