యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారధ్యంలో యువత భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు పట్టణంలోని 5, 6 వార్డుల్లో ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అందులో భాగంగానే మొదటి ఏడాది రూ. 9.50 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి 4.50 లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టిందన్నారు. యువత భవిష్యత్తును కాపాడేవిధంగా యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం స్థానికంగా ఉన్న సంస్థలతోపాటు బయట ఉన్న పరిశ్రమలు దాదాపు 50 సంస్థలు పాల్గొని భారీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 13న తణుకులోని ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాలన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీడ్‌ యాప్‌ ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link