లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థలో మార్పులు
గత వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
పేరెంట్ టీచర్ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఎన్నో మార్పులు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 117 జీవో తీసుకువచ్చి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివేసి, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించివేశారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల నుంచి మోడ్ స్కూళ్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాలో 1 నుంచి 5 వరకు మోడల్ స్కూలు ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. దాదాపు 2 కోట్లు మంది తల్లిదండ్రులు పాల్గొంటారనే ఉద్దేశంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు ఉండేదని అయితే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించి దాదాపు 16 వేల ఉపాధ్యాయులను కొత్తగా నియమించుకునేందుకు ఇటీవల పరీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనే దానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శమని చెప్పారు. గతంలో విద్యార్థులకు అందజేసే బ్యాగులు, బెల్టు, పుస్తకాలపై జగన్మోహన్రెడ్డి బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. విద్యావ్యస్థలో రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు లేదా పవన్ కల్యాణ్ బొమ్మలు వేయడం జరగలేదన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతో విద్యార్థులకు కిట్లు అందజేయడం, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేయడం జరుగుతోందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతిఒక్కరు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతోపాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


