అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం

విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకులో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీనివాసుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తణుకు పట్టణంలోని సిల్వర్‌ జూబ్లీ వంతెన వద్ద నూలి గ్రౌండ్స్‌లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆరిమిల్లి రాధకృష్ణ గారి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారితో నిర్వహించిన ఈ కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 5 వేల మంది భక్తులు తరలివచ్చారు. తొలుత ఎస్‌ఎన్‌వీటీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణతులసి దంపతులు వేదిక వద్దకు తీసుకువచ్చారు. వాయిద్యాలు, కోలాటం, కేరళ డ్రమ్ములు, బుట్ట బొమ్మలతో ఊరేగింపు అనంరతరం కనుల పండుగలా సాగిన కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో భక్తులు వీక్షించారు.

తణుకులో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవంలో భాగంగా తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పద్మజ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవం నృత్య రూపకం విశేషంగా అలరించింది. అనంతరం లావణ్య బృందంచే శ్రీ కీర్తనలు ఆలాపన శ్రావ్యంగా జరిగింది. ముఖ్యంగా శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ విభీషణ శర్మ రచన వంటి కీర్తనలు ఆకట్టుకున్నాయి. అంబికా డాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అంబిక, శిరీషలు తమ విద్యార్థులో నిర్వహించిన వినరో భాగ్యము విష్ణుకథ… అతనికంటే మరి… చక్కని తల్లికి చాంగుభళా… తగునయ్యా హరి నీకు… పిడికిట తలంబ్రాలు… తిరు తిరు జవరాల వంటి నృత్యాలు ఆహూతులను అలరించాయి. అనంతరం డాక్టర్‌ శంకర శర్మతోపాటు ఆరుగురు పండితులు పంచాంగ పఠనం చేశారు. తదనంతరం నిర్వహించిన శ్రీ శ్రీనవాస కల్యాణం ఆద్యంతం భక్తులను తన్మయత్వంలో నింపింది. ఈ కల్యాణోత్సవంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు…

Scroll to Top
Share via
Copy link