భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన మంత్రి కందుల దుర్గేష్
నేషనల్ హైవే లకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
తన లాంటి ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాత, మార్గదర్శి వాజ్ పేయ్ అని వెల్లడించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు : రాజకీయం, సాహిత్యం సమపాళ్లల్లో నడిపించిన నాయకులు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నేడు భారత మాజీ ప్రధాని, రాజ నీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకానొక సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయ్ ని అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రభుత్వం తరపున ప్రతినిధిగా పంపించారని గుర్తు చేశారు.. గొప్ప వ్యక్తిత్వం గల, విలువలు గల నాయకుడికి దక్కిన గౌరవం అది అని మంత్రి ఉదహరించారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాలను సమానంగా చూసేవారని, శాంతియుత సమాజం ఉండాలని కోరుకున్నారని మంత్రి వివరించారు. నేషనల్ హైవేలు, నాలుగు లైన్లు, ఆరు లైన్ల రహదారులు, ఆర్ఓబీ లకు ఆద్యుడు వాజ్ పేయ్ అని మంత్రి తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారికి మార్గదర్శిగా అటల్ బిహారీ వాజ్ పేయ్ నిలుస్తారని మంత్రి అన్నారు. వాజ్ పేయ్ విధానాల్లో ముందుకు వెళ్తే సమ సమాజ స్థాపన జరుగుతుందన్నారు.. తనలాంటి ఎందరికో వాజ్ పేయ్ స్ఫూర్తి ప్రధాత అని మంత్రి వెల్లడించారు.. అన్ని వర్గాలు ఉన్నత స్థానంలోకి చేరాలని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అటల్ బీహారీ వాజ్ పేయ్ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు పునరంకితం అవుదామని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.


