విజయవాడ క్యాంప్ కార్యాలయంలో దిగ్విజయంగా ముగిసిన దరఖాస్తుల సేకరణ ప్రక్రియ..6 రోజుల పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిధిలో జరిగిన ‘మెంబర్షిప్ టు లీడర్షిప్’ కార్యక్రమం విజయవంతం
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన మంత్రి కందుల దుర్గేష్
మంత్రి దుర్గేష్ ను సత్కరించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు, పార్టీ సిద్దాంతాలు నచ్చి వేలాదిగా తరలివచ్చిన జనసైనికులు, వీరమహిళలు
పార్టీ కోసం శ్రమించే వారికి సముచిత గౌరవం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టీకరణ
ఆగస్ట్ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం బాధ్యతలు చేపట్టబోయే నూతన కమిటీ సభ్యులందరినీ కలుపుకొని, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే దిశగా కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటన
విజయవాడ:జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, సమర్థవంతమైన క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పెంపొందించడమే పార్టీ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిధిలో ‘మెంబర్షిప్ టు లీడర్షిప్’ కార్యక్రమం కింద నిర్వహించిన దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ఆదివారంతో దిగ్విజయంగా ముగిసింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ నేతృత్వంలో గత 6 రోజులుగా సాగిన ఈ ప్రక్రియకు విశేష స్పందన లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి దుర్గేష్ ను సభ్యులు ఘనంగా సత్కరించారు. జై జనసేన, జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వం, మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ సభ్యులు నినదించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్క అభ్యర్థితో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా మాట్లాడి, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌తో పాటు, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలైన (విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు) అభ్యర్థుల కోసం ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అబ్జర్వర్‌గా వ్యవహరించిన మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు సీనియర్ సభ్యులు, సాధక్ ప్రతినిధులు, పార్లమెంట్ అబ్జర్వర్స్ టీమ్‌కు చెందిన 32 మంది సభ్యుల బృందం ప్రతి ఒక్క అప్లికేషన్‌ను సునిశితంగా పరిశీలించింది. లోక్‌సభ నియోజకవర్గ కమిటీ, లీగల్, విద్యార్థి, మీడియా, ఐటీ & డేటా మేనేజ్మెంట్, పర్యావరణం, సేవాదళ్, వీరమహిళ, పాడ్‌కాస్ట్, చేనేత, డాక్టర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, యువజన, సాంస్కృతిక, మత్స్యకార విభాగాలు సహా పలు అనుబంధ విభాగాల కమిటీ స్థానాల కోసం వేలాది మంది జనసైనికులు, వీరమహిళలు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఇంత పెద్ద ఎత్తున స్పందించి ముందుకు వచ్చిన దరఖాస్తుదారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ భారీ స్పందన పార్టీపై, అధినేతపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అదృష్టమన్నారు.
అభ్యర్థులు తమకున్న అర్హతలను బట్టి లోక్‌సభ, అసెంబ్లీ, జిల్లా, మండల, మరియు గ్రామ స్థాయి కమిటీలతో పాటు ఇతర అనుబంధ విభాగాలలో తమకు నచ్చిన పదవులను తామే స్వయంగా ఎంచుకునేలా అప్లికేషన్ ఫారమ్‌లను రూపకల్పన చేయడం విశేషమన్నారు. అభ్యర్థుల నుండి వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ అంతిమ నిర్ణయం తీసుకుని సమర్థులను పదవులకు ఎంపిక చేస్తారని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని, అనంతరం బాధ్యతలు చేపట్టబోయే నూతన కమిటీ సభ్యులందరినీ కలుపుకొని, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే దిశగా కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.



