తణుకులో భారీ గోల్డ్ బిస్కెట్ స్కామ్ ఆరోపణలు.. 25 కోట్ల మోసం జరిగిందన్న బాధితులు

మాయా లేడి- నయా మోసం

తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న డా.బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజావేదిక అధ్యక్షుడు చోళ్ళ రాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణం సజ్జాపురానికి చెందిన కొత్తమసు స్నేహలత, అజ్జురి దుర్గాప్రసాద్ అనే జంట గోల్డ్ బిస్కెట్లు, బంగారు వస్తువుల వ్యాపారం పేరుతో పలువురిని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 25 మందికి పైగా బాధితులు బయటకు వచ్చారని, తన సమక్షంలోనే ఏడుగురు బాధితులు ఉన్నారని తెలిపారు. మొత్తం స్కామ్ విలువ రూ.25 కోట్లకు పైగా ఉండొచ్చని పేర్కొన్నారు.

బాధితులు ఫిబ్రవరి నెలలోనే పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, బాధితులకు కాకుండా అవతలి వ్యక్తులకు పోలీసులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీఎస్పీ స్థాయి విచారణ జరిపించాలని, పది రోజుల్లో న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి తణుకులో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా బాధితురాలు పితాని ఉషరమ్య మాట్లాడుతూ అధిక వడ్డీలు, గోల్డ్ బిస్కెట్ వ్యాపారం పేరుతో మొదట తనను నమ్మించి రూ.25 లక్షల నగదు, 30 కాసుల బంగారం తీసుకున్నారని తెలిపారు. తన ద్వారా కుటుంబ సభ్యులు, పరిచయస్తుల వద్ద నుంచి కూడా సుమారు రూ.40 లక్షల నగదు, 60 కాసుల బంగారం మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, దొంగ నోట్లు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.

మరో బాధితురాలు షణ్ముఖ శైలజ మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ ద్వారా పరిచయమైన స్నేహలత అధిక లాభాల ఆశ చూపించి తన వద్ద నుంచి 36 కాసుల బంగారం, రూ.44 లక్షల నగదు తీసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.

Scroll to Top
Share via
Copy link