జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ

ఘనంగా నిర్వహణ – నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రాజమహేంద్రవరం సిటీ ఏప్రిల్ 30: సూర్య న్యూస్:-

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 30:
జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) తొలి మహాసభ గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు ఎన్. రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున పాత్రికేయులు హాజరయ్యారు.
సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మూడు తరాల జర్నలిస్టులతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వృత్తిలో ఉన్నారని, వారి సేవలు అమూల్యమని కొనియాడారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ రాజ్, ఇతర రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యత అత్యంత అవసరమని తెలిపారు. ప్రభుత్వపరంగా రాయితీలు, భద్రతా చర్యలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. రాజమహేంద్రవరం లో జరిగిన ఈ మహాసభ విజయవంతం కావడం ఫెడరేషన్ బలోపేతానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
అనంతరం సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పు గోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్. రాంబాబు, అధ్యక్షుడిగా రవికుమార్, ఉపాధ్యక్షులుగా త్రినాథ్, ఆంజనేయులు, విశాలాక్షి, ప్రధాన కార్యదర్శిగా పి. వెంకటేష్ ఎన్నికయ్యారు.

సహాయ కార్యదర్శులుగా సూర్యచంద్రరావు, నరసింహారావు, ఈశ్వర్, కోశాధికారిగా బాబూరావు బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా రామ్మూర్తి, బి. నాగేశ్వరరావు, ఎం. సుబ్బారావు, ప్రసాద్, కరీముల్లా, పి. వినోద్, ఆర్కే నాయుడు, కె. శ్రీనివాస్, హరిగణేష్, ఎ. విజయభారతి, వై. శ్రీనివాస్, వినోద్ ఎన్నికయ్యారు.

Scroll to Top
Share via
Copy link